శివప్ప, కన్నప్ప ఇద్దరూ మంచి శిల్పకారులు. శిల్పాలు చెక్కడంలో ఆ ప్రాంతంలో వారిని మించిన కళాకారులు లేరు. ఇద్దరూ పక్కపక్కన ఇళ్లల్లోనే ఉంటారు. ఓసారి సంక్రాంతి పండుగకు ఇద్దరూ ఒకే రకమైన రెండు ఏనుగు శిల్పాలు చెక్కారు.\n\n ‘వీటిని మహారాజుగారికి చూపించి పట్నం నుంచి పండక్కి కావలసిన సరుకులు కొనుక్కొని తెచ్చుకుందాం’ అన్నాడు శివప్ప. దానికి సరేనన్నాడు కన్నప్ప. ఇద్దరూ తమ శిల్పాలతో ప్రయాణమయ్యారు. మరునాడు రాజదర్బారులో ప్రవేశించడానికి అనుమతి దొరికింది. ముందుగా శివప్ప ‘మహారాజా! ఈ ఏనుగు శిల్పాన్ని చూడండి. దీనికి తగిన వెల ఇప్పిస్తే మా ఇంటిల్లిపాదీ ఆనందంగా పండుగ చేసుకుంటాం’ అంటూ తన ఏనుగు విగ్రహాన్ని రాజుగారి ముందుంచాడు. జీవ కళ ఉట్టిపడుతున్న ఆ శిల్ప సౌందర్యానికి రాజుగారు అచ్చెరువొంది ‘ఏమాత్రం ధర ఇమ్మంటారు దీనికి’ అడిగాడు.\n\n ‘రాయి ఖరీదైంది. పైగా దాన్ని చెక్కడంలో నా శ్రమ కూడా లెక్కకట్టి మీరే తగిన ధర నిర్ణయించండి’ అన్నాడు శివప్ప. మహారాజు ఆస్థాన శిల్పిని సంప్రదించి చర్చించారు. ‘శివప్పా! అన్నీ పరిశీలించి శిల ఖరీదు, మీ శ్రమ విలువనూ లెక్కకట్టి ఈ విగ్రహానికి మూడువందల వరహాలు ఇస్తున్నాను’ అంటూ సొమ్ము అందించాడు మహారాజు. వాటిని సంతోషంగా తీసుకుని పక్కకు వెళ్లాడు శివప్ప. తరువాత రాజుగారు కన్నప్ప విగ్రహాన్ని కూడా పరిశీలించారు. రెండు విగ్రహాలూ ఒకేలా ఉండడం చూసి ఆశ్చర్యపడి ‘కన్నప్పా! దీనికి మీరేం ఆశిస్తున్నారు?’ అని అడిగాడు. ‘మహారాజా! నేనీ బొమ్మను మీకు అమ్మడానికి తీసుకురాలేదు. పండుగ సందర్భంగా తమకు బహూకరించడానికి తెచ్చా. స్వీకరించండి’ వినమ్రంగా అన్నాడు కన్నప్ప. ఆ మాటలకు మహారాజు పొంగిపోయాడు. విగ్రహాన్ని ఆప్యాయంగా తాకి కన్నప్పకు వెయ్యి వరహాలిచ్చి ఘనంగా సత్కరించాడు."
