"description": "అది ఒక చిన్న అడవి. కాలి బాటకు దూరంగా గుబురుగా బోలెడన్ని చెట్లుండేవి. వాటిపై ఎన్నో కోతులు కాలక్షేపం చేస్తుండేవి.\n\n ఒక రోజు పట్నం కోతి ఒకటి ఎలా చేరిందో ఈ కోతుల గుంపులో చేరింది. దానిని పెంచుకునే వాడు పట్నం నుంచి వాళ్ల వూరెళుతూ విశ్రాంతి కోసం ఆగితే ఇది తప్పించుకుని అడవిలోకి వచ్చేసినట్లుంది.\n\n కోతులన్నీ గుంపుగా పట్నం కోతిని సమీపించాయి. దాని చారల చొక్కా, చుక్కల లాగు, కుచ్చుల టోపీ, కళ్లజోడు, తోకకి రిబ్బన్, మెళ్లొ గొలుసు.. అన్నీ వాటికెంతో వింతగా అనిపించాయి. అడవి కోతులు తనను ప్రత్యేకంగా చూడటం పట్నం కోతికి గర్వంగా అనిపించింది. ఒక కోతి కొమ్మనున్న దోర జామకాయను కోసి తినమంటూ పట్నం కోతికి ఇచ్చింది.\n\n ఇక పట్నం కోతి గొప్పలు మొదలయ్యాయి. ‘ఛీఛీ’ అంటూ ముఖం చిట్లించింది. ‘జన్మంతా ఇలా పచ్చి కాయలు తిని బతుకుతారా? బాబోయ్. మా పట్నంలో అయితేనా?’ అంది నోరూరిస్తూ. ‘నేను పట్నంలో అయితే పాలకోవాలు తింటా తెలుసా?’ అంటూ కోవాలు, కేకులు, బిస్కెట్ల రుచిని వర్ణించింది. అడవి కోతులన్నీ లొట్టలు వేశాయి. ‘మనకు రోజూ ఇవే కాయలు, ఇదే సెలయేటి నీరు’ అనుకున్నాయి నిరాశగా. వాటిలో ఒక పిల్లకోతి అయితే మరీనూ. తాను పట్నం వెళ్లి ఆ రుచులన్నీ చూసి తీరాల్సిందేనని ఉవ్విళ్లూరింది.\n\n కోతులన్నీ ఆకలి తీర్చుకోమని పట్నం కోతిని బతిమాలాయి. అయిష్టంగా ముఖం పెట్టి కొన్ని కాయలు కొరికి తింది. తప్పదన్నట్లుగా సెలయేటి నీరు తాగింది. కోతులు గౌరవంగా ఒక విశాలమైన కొమ్మను ఖాళీ చేసి పట్నం కోతికిచ్చాయి. అది బట్టలు, టోపీ అన్నీ తీసి కొమ్మల్లో పెట్టింది. హాయిగా పడుకుంది.రెండ్రోజులు గడిచాయి. పిల్లకోతి పట్నం కోతి దగ్గర తచ్చాడుతూ, దానికి పండ్లూ అవీ ఇస్తూ కాకా పట్టసాగింది. ఈ సారి పట్నం వెళ్లేప్పుడు తననూ తీసుకెళ్లమని దాన్ని అడగాలనేది దాని ఉద్దేశం.\n\n ఇదంతా గమనించిన ఒక ముసలికోతి పిల్లకోతిని పిలిచింది. దాని ఉద్దేశం తెలుసుకుని, ‘ఓసి పిచ్చిదానా! బడాయి మాటలు నమ్మొద్దు. నిజంగా పట్నమే బాగుంటే ఇక్కడి నుంచి అది తిరిగి వెళ్లట్లేదేం? మనందరం చూడు. స్వచ్ఛమైన గాలి పీలుస్తూ, శుభ్రమైన నీరు తాగుతూ, తాజా పండ్లు తింటూ ఎంత ఆరోగ్యంగా ఉన్నామో? అది చూడు. ఎలా బక్కచిక్కి ఉందో? ఎదుటి వారి మాటల్ని బట్టి కాకుండా నీ తెలివితో అంచనా వెయ్యడం నేర్చుకో’ అంటూ మందలించింది. పిల్లకోతికి నిజమేననిపించింది. పోనీ ఆ బట్టలన్నా ఒకసారి వేసుకుని మోజు తీర్చుకుందామనుకుంది. పట్నం కోతి నిద్రలో ఉండగా మెల్లిగా ఆ బట్టలు తీసుకుని వేసుకోబోయింది. అలికిడికి కళ్లు విప్పిన పట్నం కోతి ఆ బట్టలు లాక్కుని సెలయేట్లోకి విసిరేసింది.\n\n ఏడుస్తూ పిల్లకోతిని కౌగిలించుకుంది. ‘ఆ దిక్కుమాలిన బతుకు నీకొద్దమ్మా వద్దు. నా యజమాని నా మెడకు గొలుసుకట్టి, నన్ను ఆడించి, అందరి దగ్గరా డబ్బులడుక్కుని బతికేవాడు. వాడికే పూటగడవంది నాకేం పెడతాడు? ఎవరో, ఎప్పుడో విసిరిన కొవా ముక్క రుచినే నేను వర్ణించాను’ అంది నిజాయతీగా.\n\n వింటున్న కోతులన్నింటికీ కళ్లనీళ్లు తిరిగాయి. తన డాంబికాల వల్ల సాటి ప్రాణికి నష్టం వస్తోందని తెలియగానే పట్నం కోతి నిజం ఒప్పుకుంది. కోవా తిన్న కోతి మనసు ఎంత తియ్యనిదో గుర్తించిన కోతులన్నీ దానిపై మరింత గౌరవం పెంచుకున్నాయి. ఎప్పటికీ అడవిలోనే అవన్నీ ఆనందంగా బతికాయి."
