అందమైన పువ్వుంది... అందులో దెయ్యముంది!

రెండు వైపులా పదునైన కొమ్ములు... బెదరగొట్టే ఎర్రని కళ్లు... గుర్రుగా చూసే భయంకరమైన ముఖం... బాబోయ్‌ ఇవేవో దెయ్యం వివరాల్లా ఉన్నాయే అనుకుంటున్నారా?కానీ ఇవి ఓ కొత్త పువ్వు సంగతులు!\n\n   రకరకాల అందమైన పూలని, కనువిందుచేసే కుసుమాల్ని చూసుంటారు. కానీ జడిపించే రూపంతో ఉండే పువ్వును చూశారా? అచ్చంగా పిశాచి ముఖం పోలికలతో ఉండే ఓ రకం పుష్పం ఈమధ్యే కొత్తగా కనిపించింది.\n\n   * దీని రూపానికి తగినట్టే ‘డెవిల్‌ హెడ్‌ ఫ్లవర్‌ అని పిలుస్తారు. శాస్త్రీయ నామం టెలిపోగన్‌ డయాబొలికస్‌. \n\n   * మనం కథల్లో వింటుంటాం కదా రాకాసి దెయ్యాలంటే తలకు అటూ ఇటూ పెద్దపెద్ద కొమ్ములు, ఎర్రని కళ్లతో ఉంటాయని. ఈ పువ్వు మధ్యభాగంలో కూడా అచ్చం అదే ఆకారంలో ఉండే వింతైన భాగం ఉంటుంది కాబట్టి దీనికా పేరు పెట్టారు. \n\n   * ఆర్కిడ్‌ పూలు తెలుసుగా. ప్రపంచ వ్యాప్తంగా 25 వేలకుపైగా జాతులతో చిత్రవిచిత్రమైన రూపాలతో ఉంటాయి. వాటిల్లో ఇది కూడా ఒకటి. \n\n   * ఈమధ్యే ఈ వింత పూలని పోలండ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కొంతమంది పరిశోధకులు దక్షిణ అమెరికాలోని కొలంబియాలో గుర్తించారు. \n\n   * మొదట్లో ఇదేదో ఇదివరకే తెలిసిన ఆర్కిడ్‌ పువ్వు అనుకున్నారు. బాగా పరిశీలించి చూస్తే కొత్తరకం ఆర్కిడ్‌ అని తెలిసింది. \n\n   * హఠాత్తుగా చూస్తే ‘అరె... ఈ పువ్వులో ఎవరైనా ఇలా వింత బొమ్మ ముఖాన్ని గీశారా?’ అన్న భ్రమను కల్గిస్తుందిది. \n\n   * ఈ పువ్వు చుట్టూ లేత ఎరుపు రంగులో పలుచని మూడు రేకలుంటాయి. మధ్యలో ముదురు ఎరుపు రంగులో దెయ్యం ముఖాన్ని పోలిన ఆకృతి ఉంటుంది. \n\n   * ఈ ఆర్కిడ్‌ మొక్క 5.5 నుంచి 9 సెంటీమీటర్ల పొడవుంటుంది. \n\n   * మొంటెన్‌ అడవిలో ఉన్న ఇవి అన్నీ కలిసి 30 వరకే ఉన్నాయి. ఈ వింత ఆర్కిడ్లు పెరగడానికి అనుకూల పరిస్థితులు లేకపోవడం వల్ల ఇవి అంతరించిపోయే దశలో ఉన్నాయిట. \n\n   * ఇప్పటి వరకు కొలంబియాలో 3,600 జాతుల ఆర్కిడ్‌ పూజాతులున్నాయని కనుగొన్నారు.\n\n   మీకు తెలుసా? \n\n   * ఆర్కిడ్‌ పూలు చాలా పురాతనమైనవి. దాదాపు 10 కోట్ల ఏళ్ల నుంచి ఉన్నాయి. \n\n   * భూమి మీద గడ్డి తర్వాత విస్తారంగా పరుచుకున్నవి ఇవే.\n\n   * ఆరునెలల వరకు వాడిపోకుండా ఉండే ఆర్కిడ్‌ పూలు కూడా ఉన్నాయి. \n\n   * వీటిల్లో అతిచిన్న ఆర్కిడ్‌ రెండు మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది."