మిఠాయి కావాలా మిట్టూ!

      "description": "రంగాపురం, మంగాపురం మధ్యలో అడవి. దాంట్లో మిట్టూ అనే ఓ ఎలుగుబంటి ఉండేది.\n\n   ఓ రోజు మిగులపండిన పనస పండొకటి మిట్టూ కంటపడింది. దానిని కోసి తన వాడి గోళ్లతో చీల్చింది. ఘుమఘుమలాడే తియ్యని పనస తొనలు కడుపారా తింది. చెలమలో నీళ్లు తాగింది. భుక్తాయాసంతో ఒక పెద్ద చెట్టు మొదలు నానుకుని కునికిపాట్లు పడసాగింది. ఇంతలో ముగ్గురు యువకులు ఆ చెట్టు కింద ఆగారు\n\n   అటువేపు ఎలుగు ఉన్న సంగతి వాళ్లు గమనించలేదు. వాళ్లలో నల్లగా, లావుగా ఉన్న ఒకడు నీళ్లలోకి దిగి జలకాలాడసాగాడు. మిగిలిన ఇద్దరు అతను వినకుండా మెల్లిగా మాట్లాడుకుంటున్నారు. నిద్ర మత్తులో కళ్లు మూస్తూ, తెరుస్తూ మిట్టూ ఆ మాటలు వింటోంది. ‘రాజు ఎలుగ్గొడ్డులా భయంకరంగా ఉంటాడు. వీడికి అంత అందమైన పిల్లతో పెళ్లి కుదరడం ఎంత ఆశ్చర్యమో కదా!’ అన్నాడొకడు.\n\n   ‘అంతా డబ్బు మహిమ’ అన్నాడు రెండోవాడు. వాళ్ల మాటలు విన్న మిట్టూకి మొదట చాలా ఏడుపొచ్చింది. ‘ఈ మనుషులు అందవికారంగా ఉన్నవాళ్లని తనతో పోలుస్తారన్నమాట’ అనుకుని కుంగిపోయింది. ఇంతలో దానికో తమాషా ­హ తోచింది. ‘నేను రాజులా ఉన్నప్పుడు అతడి బట్టలు వేసుకుని ­ళ్లొకెళితే అందరూ రాజే అనుకుంటారు. ఎంచక్కా పెళ్లి చేసుకుని బోలెడన్ని మిఠాయిలు కొనుక్కోవచ్చు’ అనుకుంది. అడవిలో ఒకే రకమైన తిండితో మొహం మొత్తిన మిట్టూకి ఈ ఆలోచనతో ఎక్కడలేని హుషారు వచ్చింది. చెట్టు మొదట్లో అతడు విడిచిన పంచె, చొక్కా తొడుక్కుని అక్కడినుంచి చల్లగా జారుకుని రంగాపురం వైపు నడక మొదలెట్టింది. అంతలో అటువైపు నుంచి ఒంటరిగా వస్తున్నాడో యువకుడు. మిట్టూని చూసి కెవ్వున అరిచి స్పృహ కోల్పోయాడు. పాపం... మిట్టూ తెల్ల మొహం వేసింది. దుస్తులు వేసుకున్నంత మాత్రాన తను రాజులా లేనని దానికి అర్థమయ్యింది. ఆ యువకుడిని చూస్తే దానికి జాలేసింది. రెండు చేతులతో నీళ్లు తెచ్చి అతని మొహంపై చల్లింది. అతనికి స్పృహ వచ్చాక ఒక దొప్పలో తేనె పిండి తాగించింది. కొన్ని పనసతొనలు అతడికి ఇచ్చింది.\n\n   బిత్తరపోయి వణుకుతున్న యువకుడు తేరుకుని మిట్టూ మంచితనానికి ఆశ్చర్యపోయాడు. కృతజ్ఞతగా తన సంచీలోంచి కొన్ని మిఠాయిలు తీసి దానికిచ్చాడు. అందంగా లేనని కుమిలిపోతున్న మిట్టూ మనసు అప్పుడు చల్లబడింది. ఎవరైనా గౌరవం ఇచ్చేది పైకి కనబడే రూపానికి కాదు, మన మంచి తనానికి, చేసే మంచి పనులకు అని తెలుసుకుంది. తేలికపడ్డ మనసుతో తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది."