ఇది సాగరకన్యల స్కూలోచ్‌!

సగం అమ్మాయి, సగం చేప. ఇలాంటి సాగరకన్యలు సముద్రాల్లోపల ఉండేవారని కథలుకథలుగా చెప్పుకుంటాం. ‘సాహస వీరుడు సాగరకన్య’ సినిమాలో కథంతా జలకన్య చుట్టే తిరుగుతుంది. మరి వీళ్లను నిజంగా చూడాలని ఉందా? అయితే పదండి సింగపూర్‌.\n\n   * సింగపూర్‌లో తొలి మర్మైడ్‌ (సాగరకన్య) స్కూల్‌ను గతేడాది ప్రారంభించారు. అందులో చేపలా కనిపించే దుస్తులు వేసుకుని వందలాది మంది జలకన్యలు కనిపిస్తారు.\n\n   * మరి ఇందులో ఏం నేర్పిస్తారు? మామూలుగా ఈత నేర్చుకోవడం వేరు, అదే వెనకాల చేపతోకతో ఈదడం వేరు. ఇది అంత సులువు కాదు, కాబట్టి సాగర కన్యలా ఎలా ఈదాలో శిక్షణ ఇస్తారు. అంతేకాదు, నీళ్లలోపల మెలికలు తిరుగుతూ ఎలా ఈదాలో, రకరకాల విన్యాసాలు ఎలా చేయాలో టీచర్‌ దగ్గరుండి మరీ నేర్పిస్తారు. వీళ్లకు పోటీలు కూడా పెడుతుంటారు.\n\n   * ఇందులో పెద్దలే కాదు, చిన్న పిల్లలు కూడా చేరి బుల్లి సాగర కన్యలుగా మారుతున్నారు. మగవాళ్లు కూడా చేప తోక దుస్తులు వేసుకుని ఈదడానికి ఇష్టపడుతున్నారు. ఈ పాఠశాల్లో శిక్షణ పొందినవారు బయట జలకన్యల పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ జలకన్య ఈత ఆరోగ్యానికి కూడా మంచిదే తెలుసా?\n\n   * సైరెనా అనే ఆవిడ ఈ మర్మైడ్‌ స్కూల్‌ ప్రారంభించింది.\n\n   * ఇలాంటి మర్మైడ్‌ స్కూళ్లు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా ఉన్నాయి!"