రాజయ్య, నక్కలతోటలో పేరుమోసిన భూస్వామి. రాజయ్య భవంతి ఎదురుగా ఉండే చిన్న పెంకుటింట్లో చలమయ్య అనే చిన్నపాటి రైతు ఉండేవాడు.\n\n రాజయ్య, చలమయ్యలు ఇద్దరూ తమ కూతుళ్లని ఒకే వూరి అబ్బాయిలకిచ్చి పెళ్లి చేశారు.\n\n రాజయ్య అడపాదడపా గుర్రపుబండి కట్టించుకుని అవీ ఇవీ తీసుకుని కూతురింటికి వెళ్లొస్తుండేవాడు.\n\n చలమయ్యకీ తన కూతురి కోసం అలా వెళ్లాలనున్నా దారి ఖర్చులకి దడిసి వూరుకునేవాడు. ఒక రోజు చలమయ్య భార్య చేగోడీలు చేసింది. కూతురికి చేగోడీలు ఇష్టం కదా, అని తలుచుకుని దిగులుపడింది. ఇంతలో రాజయ్య ఇంటి ముందు గుర్రబ్బండి ఆగి ఉండటం చూసింది. పళ్లూ, ఫలహారాల డబ్బాలు, బట్టలు ఏవేవో సర్దించడం చూసింది. ఇక ఆమెకు మనసాగలేదు. వెంటనే చలమయ్య దగ్గరకి వెళ్లి, ‘ఆయనెలాగూ కూతురి దగ్గరకి వెళుతున్నాడు కదా, మనమ్మాయి కూడా చేగోడీలు అందజేయమని అడగరాదూ?’ అంది.\n\n చలమయ్య ‘అంతటి ధనికుడికి మనం పని పురమాయిస్తే బాగుంటుందా?’ అని కాసేపు తటపటాయించినా చివరికి ధైర్యం చేసి వెళ్లి, వినయంగా అడిగాడు.\n\n రాజయ్య హుందాగా ‘దానిదేం భాగ్యం చలమయ్యా! మీ అమ్మాయి ఇంటి మీదుగానే వెళతాను కదా? ఇస్తానులే’ అని హామీ ఇచ్చాడు. చేగోడీల డబ్బా అందుకుని గుర్రపుబండిలో తన పక్కనే పెట్టుకున్నాడు బండి బయలుదేరింది.\n\n కాసేపు ప్రయాణించాక రాజయ్య చూపు డబ్బాపై పడింది. మూత తీసి చూసి, ఒక చేగోడీ నోట్లో వేసుకున్నాడు.\n\n కమ్మగా కరకరలాడుతూ ఉన్న ఆ చేగోడీల రుచిని రాజయ్య ఎంతో ఇష్టపడ్డాడు. వద్దనుకుంటూనే ఆగలేక డబ్బాలో చెయ్యిపెట్టి మరికొన్ని చేగోడీలు తీసుకుని తిన్నాడు. వూరు చేరాక ఆ డబ్బాని చలమయ్య కూతురికిచ్చి తన కూతురింటికి వెళ్లాడు. సాయంత్రానికి తిరిగి ఇంటికి వచ్చిన రాజయ్యకి తన వేలికి ఉండే వజ్రపుటుంగరం కనిపించలేదు. బండిలోను, దారి వెంబడి వెతికించినా దొరకలేదు. కొన్నాళ్లు గడిచాయి. సంక్రాంతి పండక్కి ఇద్దరి అల్లుళ్లూ, కూతుళ్లూ వచ్చారు.\n\n చలమయ్య కూతురు వస్తూనే తండ్రిని పిలిచి, ‘నాన్నా! నువ్వు పంపిన చేగోడీలలో ఈ ఉంగరం ఉందంటూ’ ఇచ్చింది. మిలమిలలాడే ఆ వజ్రపుటుంగరం రాజయ్యదని పోల్చుకున్నాడు చలమయ్య. రాజయ్య చేగోడీల కోసం డబ్బాలో చెయ్యి పెట్టినపుడు ఉంగరం జారిపోయి ఉంటుందని గ్రహించాడు.\n\n ఆ ఉంగరం తీసుకుని వెళ్లి రాజయ్యకు ఇచ్చాడు. రాజయ్య మొహం వెలవెలపోయింది. చేగోడీలు తీసుకుని తిన్న సంగతి చలమయ్యకు తెలిసిపోయి ఉంటుందని బాధపడ్డాడు. అది గ్రహించిన చలమయ్య, ‘అయ్యా! నాకిప్పుడు ఓ సంగతి గుర్తొస్తోంది. వూరికి బయల్దేరే ముందు తమరు స్నానానికి వెళుతూ ఉంగరం తీసి ఉంటారు. ఆ ఉంగరాన్ని చెట్టు మీద కోతి తీసి వేలికి పెట్టుకుని ఉంటుంది. ఆ తర్వాత అది మా ఇంట్లోకి వచ్చి చేగోడీల డబ్బాలో చేయి పెట్టింది. ఆ ఉంగరం కాస్తా అందులోకి జారి ఉంటుంది. నేను దాన్ని అదిలించి కొట్టి, ఆ డబ్బానే తెచ్చి మీ బండిలో పెట్టాను. ఉంగరాన్ని గమనించలేదు. ఇప్పుడు నా కూతురు తెచ్చి ఇచ్చింది’ అన్నాడు. రాజయ్య ఆశ్చర్యపడ్డాడు. విషయం అర్థమై కూడా తను నొచ్చుకోకుండా ఉండడానికి చలమయ్య అబద్ధమాడుతున్న విషయం గ్రహించాడు. అతడి మంచితనాన్ని మనసులోనే మెచ్చుకున్నాడు."
