దొంగతనంగా పక్షుల గుడ్లు తిని జీవిస్తుండేది ఒక గుడ్లగూబ. గుడ్లగూబ ఆగడాలను తెలుసుకున్న పక్షులు తమ గూళ్లలో ఉన్న గుడ్లను జాగ్రత్తగా కాపాడుకోవడం ప్రారంభించాయి.\n\n ఇప్పుడు గుడ్లగూబకు ఆహార సమస్య ఎదురైంది. ఆకలి శ్రుతి మించడంతో అటూ ఇటూ తిరుగుతూ జామచెట్టుపై వాలింది. అప్పటికే ఒక చిలకమ్మ జామపండును ముద్దు ముద్దుగా కొరుకుతూ తినడం కనిపించింది. ‘చిలకమ్మా! రుచీ, పచీ లేని ఆ పళ్లను ఎలా తింటున్నావు?’ అంటూ మాట కలిపింది గుడ్లగూబ.\n\n ‘పళ్లు ఆరోగ్యానికి మంచివి. ఎన్ని తిన్నా నష్టం లేదు’ సమాధానమిచ్చింది చిలకమ్మ.\n\n ‘ఆకలేస్తుంది. అలా అని ఈ పళ్లు తినలేను’ దిగులుగా చెప్పింది గుడ్లగూబ.\n\n ‘అదే పొరపాటు. ఆకలేసినపుడు దొరికిన తిండి తినడంలో తప్పులేదు. కావలిస్తే ఈ పండు తిను ఎంత తియ్యగా ఉంటుందో చూడు’ అంటూ జాలిపడి తను కొరికిన పండు ఇచ్చింది చిలకమ్మ.\n\n ఆ పండును అందుకొని గుడ్లగూబ తింది. నిజంగానే తియ్యగా ఉంది. ‘చిలకమ్మా! నువ్వు కొరికాకే ఈ పండుకు ఇంత తియ్యదనం వచ్చింది కదా?’ అంటూ పొగిడింది గుడ్లగూబ.\n\n ‘అంతా నీ అభిమానం!’ అంటూ సిగ్గుపడింది చిలకమ్మ.\n\n ‘నువ్వు కొరికిన పండే అంత తియ్యగా ఉంటే నిన్ను చంపి తింటే ఇంకెంత తియ్యగా ఉంటుందో నీ మాంసం’ అంటూ తన కాళ్లతో చిలకమ్మ రెక్కలను నొక్కిపట్టింది గుడ్లగూబ.\n\n ప్రాణాల మీదకు రావడంతో బిత్తరపోయిన చిలకమ్మ ఉపాయమే శరణ్యమనుకొంది. వెంటనే ‘గుడ్లగూబ మామా! నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. తియ్యదనమంతా నా ముక్కులో ఉంది. మొదట నా ముక్కు కూడా నీ ముక్కులాగే ఉండేది. అప్పుడు ఏది తిన్నా రుచీపచీ లేదని నేను బాధపడేదాన్ని. మా తాత చెప్పినట్టు కొలిమిలో ఈ ముక్కును ఎర్రగా కాల్చుకున్నాను. అప్పటి నుంచి ఏది తిన్నా తియ్యగా ఉంటుంది. నువ్వు ఒకసారి ప్రయత్నించి చూడు’ అంది చిలకమ్మ.\n\n ‘అసలు రహస్యం చెప్పి బతికిపోయావు’ అంటూ చిలకమ్మను విడిచిపెట్టి, కమ్మరి కొలిమి వైపు వెళ్లింది. ఎర్రని నిప్పు కణాలలో ఒక్క ఉదుటున ముక్కు పెట్టింది. ముఖమంతా కాలిపోయింది. బాధ తట్టుకోలేక అందులోనేపడి చచ్చిపోయింది గుడ్లగూబ."
