సిరిపురం నుంచి గిరిపురం వెళ్లేదారి అది. బాటకి రెండువైపులా చెట్టూ చేమలు దట్టంగా అల్లుకుని ఉన్నాయి. ఆ దారిన వెళుతున్న ఒక కుంటివాడికి ఒక మూగవాడు జతకలిశాడు. అప్పటిదాకా ఒక కాలు ఈడుస్తూ, బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేస్తున్న కుంటివాడికి తోడు దొరికినందుకు ప్రాణం లేచి వచ్చింది.\n\n స్నేహంగా నవ్వాడు. మూగవాడి పరిస్థితీ అంతే కావడంతో తానూ ఆదరంగా నవ్వాడు. అతడు మూగవాడని గ్రహించుకున్న కుంటివాడు తానే గలగలా కబుర్లాడడం ప్రారంభించాడు. అతడి మాటకారితనానికి మూగవాడు ముగ్ధుడయ్యాడు. దారిలో దానిమ్మ చెట్టు కనబడితే మూగవాడు ఎగిరెగిరి పళ్లు కోశాడు. కుంటివాడు చక్కగా వలిస్తే ఇద్దరూ తిన్నారు.\n\n అలా కాసేపు గడిచాక చిత్రంగా ఇద్దరిలో అసూయ ప్రవేశించింది. గలగలా మాట్లాడుతున్న కుంటివాడిని చూసి మూగవాడు మనసులో తల్లడిల్లాడు.\n\n బలిష్ఠమైన కాళ్లతో దృఢంగా నడుస్తున్న మూగవాడిని చూసి కుంటివాడు తన దురదృష్టానికి కుమిలిపోసాగాడు.\n\n ఆలోచనలతో ఇద్దరూ పరధ్యానంగా నడవసాగారు. కబుర్లు ఆగిపోయాయి. వాతావరణం గంభీరంగా మారింది.నడక వేగం తగ్గించి కుంటి వాడితో నెమ్మదిగా నడవాల్సి రావడం ఇప్పుడు మూగవాడికి విసుగ్గా ఉంది.అతడి సైగలు అర్థం చేసుకుంటూ జవాబివ్వాల్సి రావడం కుంటివాడికి చిరాకనిపించింది. మూగవాడు నడక వేగం పెంచి నడుస్తూ కొద్దిసేపటికి కుంటివాడికి కనుమరుగైపోయాడు.వారి మనసులు భారంగా ఉండటంతో తర్వాత ప్రయాణం వారికి కష్టంగా తోచింది. వేగంగా నడవగలిగినప్పటికీ తాను ఇప్పుడు కాళ్లీడ్చుకుంటూ నడుస్తున్నట్లు మూగవాడు గమనించాడు.ఇంతలో విరగకాసిన మరో దానిమ్మ చెట్టు వాడి కంటపడింది. వెంటనే అతడికి కొత్త మిత్రుడు గుర్తొచ్చాడు. అతడు కాయ వలిచి తనకు సగం ఇవ్వడం, మిగిలినవి ఇష్టంగా తినడం గుర్తొచ్చింది. అలా దానిమ్మ గింజలు పంచుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ నడుస్తుంటే మనసు ఎంత తేలిగ్గా, హాయిగా ఉందో తెలిసొచ్చింది.తాను ఈ చెట్టుదాటి వెళ్లిన కాసేపటికి తన మిత్రుడొస్తాడు. పళ్లంటే ఇష్టమున్నా కోసుకోలేక ఉసూరుమంటాడు. ఇలా అనుకోగానే మూగవాడి మనసు చివుక్కుమంది.కొన్ని కాయలు కోశాడు. గింజలు వలిచి బాదం ఆకుల్లో పోశాడు. మిత్రుని కోసం వేచి ఉన్నాడు. కాసేపటికి దూరంగా వస్తున్న స్నేహితుడిని చూసి వికసించిన ముఖంతో ఎదురెళ్లాడు. మూగవాడి చేతిలో దానిమ్మగింజలు చూసిన కుంటివాడు కూడా చల్లగా, హాయిగా నవ్వాడు.ఇద్దరి మనసులూ తేలికపడ్డాయి. నెమ్మదిగా అయినా ఎనలేని సంతోషంతో వారి తదుపరి ప్రయాణం సాగిపోయింది.‘ఈర్ష్య కలిగించే శారీరక, మానసిక వేదన ఎంత భయంకరమో’ వారు అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు."
