కాకి కనువిప్పు

      "description": "ఓ అందమైన పల్లెటూరు. అందులో ఒక ఇంట్లో వారికి పెంపుడు జంతువులంటే మక్కువ ఎక్కువ. కుక్కలు, చిలుకలు, పావురాలు, కుందేళ్లను పెంచుకుంటూ ఉండేవారు. ఇంటి చూరుకు వడ్ల గింజల కంకులు వేలాడదీసేవారు. వాటి కోసం వచ్చే పిచ్చుకల కిలకిలలతో ఆ ఇల్లంతా ఆహ్లాదంగా ఉండేది. వారికి భూత దయ చాలా ఎక్కువ. అందుకే ప్రతిరోజూ భోజనం చేసే ముందు తొలి ముద్దను గోడపై ఉంచేవారు. అదే పెరట్లో చెట్టుపైన ఓ కాకి గూడు పెట్టుకుని ఉండేది. రోజూ ఆ ముద్దల్ని తినేది. కమ్మని నెయ్యి వేసి కలిపిన ఆ పప్పు అన్నం ముద్దల రుచిని అది ఎంతో ఇష్టపడేది. ఇంకెటూ వెళ్లేది కాదు. దీంతో అది అక్కడున్న పెంపుడు జంతువులన్నింటికీ మంచి నేస్తమైపోయింది.\n\n ఒకసారి ఆ కుటుంబం అంతా పెళ్లికని పట్నం వెళ్లింది. వారి వద్ద ఉన్న కుక్కలు, చిలుకలు, పావురాలు, కుందేళ్లు అన్నింటినీ వేరే ఇంటి వాళ్లకు అప్పగించారు. వాటికి ఆహారం పెట్టమని చెప్పారు. దీంతో పాపం... కాకికి ఏమీ తోచలేదు. ఇంతలో దూరంగా కుహూకుహూ అంటూ కోయిల పాట వినిపించింది. ఒంటరిగా ఉన్న కాకికి పరమానందమైంది. ఆ దిక్కుగా ఎగురుతూ వెళ్లి కోయిల గూటికి చేరింది. కోయిల కమ్మని కంఠాన్ని పొగిడింది. ‘నీ గొంతులో ఎంతటి మాధుర్యమో! నా గొంతు చూడు ఎంత కర్ణకఠోరంగా ఉందో’ అంది నిజాయతీగా. కాకి స్నేహ స్వభావానికి, కపటం లేని మాటలకి కోయిల ముగ్ధురాలైంది. రెండూ స్నేహితులైపోయాయి.\n\n అంతలోనే మూడు రోజులైంది. ఆ ఇంటిగలవారు పట్నం నుంచి తిరిగి వచ్చేశారు. తన స్నేహితులు కూడా వచ్చేయడంతో కాకికి పండగ అయ్యింది. ఓ చల్లని పగటి పూట ఆ ఇంటి పెంపుడు జంతువుల దగ్గరికి చేరి కాకి కబుర్లు చెబుతూ నవ్వించ సాగింది. తన పూర్వీకులు అడవుల్లో మాత్రమే ఉండేవారని, తన ముత్తాతని నక్క మాంసం ముక్క కోసం మోసం చేసిందని చెప్పింది. అందుకు బాధపడుతూ తామంతా వూళ్లలోకి వచ్చేశామని పిట్టకథలు చెప్పి వాటిని నవ్వించసాగింది. దూరంగా ఉన్న కోయిలకు ఈ సందడి సరదాగా అనిపించింది. ఎగురుకుంటూ వచ్చి వారి వద్ద వాలింది.\n\n ‘కాకి బావా! నా పాట బాగుంటుందన్నావు కదా! ఇప్పుడు పాడనా? అందరూ వింటారు’ అంది. అప్పటి వరకు మిత్రులని నవ్విస్తూ వాటి మధ్య గొప్పగా వెలిగిపోతున్న కాకి, కోయిల రాకతో ముఖం చిట్లించుకుంది. తన మాటలకంటే కోయిల పాటే తన నేస్తాలకు నచ్చుతుందని సందేహించింది. అప్పుడు తన గొప్పతనం తగ్గిపోతుందని భయపడింది. దీంతో కోయిలతో వెటకారంగా మాట్లాడింది. ‘ఏంటి నీ మిడిసిపాటు? నీ పాట బాగుంటుందని నువ్వే చెప్పుకుంటున్నావ్‌? ఆ మాట వినేవాళ్లు కదా అనాలి? చెప్పుకున్న గొప్పలు చాల్లే పో’ అంది ఈసడింపుగా. ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలా, అందరిలో ఒకలా ఉన్న కాకి ప్రవర్తనకి కోయిల బిత్తరపోయింది. జరిగిన పరాభవానికి బాధపడుతూ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది.\n\n కుక్క, కుందేలు... కాకిని తప్పుబట్టాయి. పావురాలు చిరాగ్గా తల తిప్పుకున్నాయి. చిలుకలు ముద్దు పలుకులతో దాన్ని మందలించాయి. అటుగా వెళ్లే పిల్లికూడా దాన్ని హేళనగా చూసింది. రెండు రోజులు గడిచాయి. జంతువులన్నీ కాకితో ముభావంగా ఉంటున్నాయి. ఎప్పుడో ఈ కాకి తమనూ అవమానిస్తుందేమో అన్నట్లున్నాయి... వాటి ముఖాలు. దీంతో కాకికి కనువిప్పు కలిగింది. తన ప్రవర్తనకు సిగ్గుపడింది. కోయిల దగ్గరకు వెళ్లి తనను క్షమించమని వేడుకుంది. కోయిల గుడ్లను తన గూటిలో పెట్టేలా, తాను వాటిని పొదిగి, పిల్లలు చేసి అవి ఎదిగే వరకు సంరక్షించేలా దాన్ని ఒప్పించింది.\n\n అందుకే ఇప్పటికీ కోయిలలు తమ గుడ్లను కాకి గూట్లో వదిలి వెళతాయి. కాకులే వాటిని పొదిగి పిల్లలను ఎగిరే వరకు కాపాడతాయి."