అనంత మహర్షి దగ్గర సుధీరుడు, గుణనిధి అనే ఇద్దరు శిష్యులు ఉండేవారు. ఒకనాడు మహర్షి వారిద్దరిని పిలిచి ‘ఈనాటితో నా దగ్గర మీ శిష్యరికం పూర్తయ్యింది. మీరు అన్ని పరీక్షల్లో ఉత్తమంగా నిలిచారు. కానీ జ్ఞానం కన్నా అనుభవం, ఆచరణ గొప్పవి. అందుకే మీరిద్దరూ చుట్టుపక్కల ఏ గ్రామానికైనా వెళ్లి ఆరు నెలలు నివసించి ఆశ్రమానికి తిరిగి రండి. మీరు గ్రహించిన విషయాల్ని బట్టి మీ శిక్షణ పూర్తి అయ్యిందో లేదో నిర్ణయిస్తా’ అన్నాడు.\n\n గురువు ఆజ్ఞ ప్రకారం శిష్యులు బయలుదేరి వెళ్లారు. సుధీరుడు కృష్ణాపురం అనే గ్రామం చేరి వూరి మధ్యలో ఉన్న రావిచెట్టును నివాసంగా చేసుకున్నాడు.\n\n గ్రామంలో అన్ని వనరులు పుష్కలంగా ఉన్నా కూడా ఆ వూరివారంతా ఎల్లప్పుడూ అసంతృప్తితో ఉండేవాళ్లు. అది అర్థం చేసుకున్న సుధీరుడు తన జ్ఞాన బోధతో మంచి విషయాల్ని చెబుతూ, అందరినీ చైతన్యవంతుల్ని చేయసాగాడు. అతని ఉపన్యాసాలకు ప్రభావితమైన ఆ వూరి ప్రజలు ఆదర్శవంతంగా మెలుగుతూ భక్తి భావాలను పెంచుకుంటూ, క్రమక్రమంగా ధర్మ మార్గంలో పయనించసాగారు.\n\n గుణనిధి చేరిన చిత్రాపురం గ్రామంలోని ప్రజలు చాలా ఏళ్ల నుంచి వర్షాలు పడక, పంటలు పండక, పేదరికంతో జీవిస్తూ ఉన్నారు. ఆ గ్రామ ప్రజలు ఒకరినొకరు నిందించుకుంటూ, అకారణంగా శత్రుత్వం పెంచుకుంటూ జీవించడం గుర్తించిన గుణనిధి ముందుగా వారందరిలో ఐకమత్యాన్ని పెంపొందించాలని, అంతకన్నా ముందు పేదరికాన్ని రూపుమాపాలని నిర్ణయించుకున్నాడు. ఆ వూరి జమీందారును కలిసి వూరి మధ్యలో చెరువు తవ్వించడానికి ధనాన్ని ఇవ్వడానికి ఆయన్ను ఒప్పించి, ప్రజలందరినీ సమావేశపరిచాడు.\n\n ‘మీరంతా ఒక తాటిపై నిలిచి, సహకరిస్తే ఈ చెరువు నిర్మాణం పూర్తవుతుంది. అందరూ తలో చేయి వేసి ఈ కార్యాన్ని పూర్తి చేస్తే నీటి సమస్య పరిష్కారమవుతుంది’ అన్నాడు. గుణనిధి నాయకత్వ స్ఫూర్తితో ప్రజలంతా కలిసి శ్రమదానం చేసి చెరువు తవ్వుకొని నీటి ఎద్దడిని నివారించుకున్నారు. పంటలు పండించుకుని ఐకమత్యంగా జీవించసాగారు.\n\n ఆరునెలల అనంతరం అనంత మహర్షిని కలిసి తమ అనుభవాల్ని శిష్యులిద్దరూ వివరించారు. ఇది విని మహర్షి ఎంతో సంతోషించి ‘సుధీరుడు ప్రజల్ని ధర్మ మార్గంలో, గుణనిధి ప్రజల్ని శ్రమదానంలో నడిపించారు. ఏ దేశానికైనా కష్టించి పనిచేయడం, ధర్మాన్ని పాటించడం రెండూ రెండు కళ్ల లాంటివి. అవి పాటించిన ప్రజలు ఎప్పుడూ ఉన్నతంగా ఎదుగుతారు. నాయనలారా! ఎక్కడి సమస్యలను బట్టి అక్కడ పరిష్కారం వెతుక్కుంటూ మీరు ముందుకు సాగారు. ఈ నాటితో మీ శిక్షణ పూర్తిగా ముగిసింది. ఇలాగే మానవాళికి ఉపయోగపడే విధంగా ఉత్తమ మార్గంలో పయనించండి’ అంటూ వారిని ఆశీర్వదించి పంపించాడు."
