ఖరీదైన సలహా

పానకాలు మంచి పలుకుబడి ఉన్న వకీలు. తరచు అతని ఇంటికి ఎవరో ఒకరు వచ్చి సలహాలు తీసుకుని పోతుంటారు. న్యాయస్థానంలో అనేకమంది తగాదాలను వాదించి గెలిపించాడు. పానకాలుకి ఎనిమిదేళ్ల కొడుకు ఉన్నాడు.\n\n   పానకాలు ఇంటి ఎదురుగానే భూషయ్య అనే వడ్డీ వ్యాపారి ఉన్నాడు. అతను చాలా తిరకాసు మనిషి. ఎలాంటి వారి నుంచి అయినా అసలు, వడ్డీ ముక్కుపిండి వసూలు చేసేవాడు. ఒకసారి భూషయ్య మీద ఫిర్యాదు చేసిన మనిషి తరఫున వాదించి గెలిపించాడు పానకాలు. అప్పటి నుంచి పానకాలు అంటే భూషయ్యకు ఒళ్లుమంట.\n\n   భూషయ్య కొడుకు కూడా పానకాలు కొడుకు చదివే తరగతే! అదే పాఠశాలలో చదువుతున్నాడు. ఆ ఇద్దరుపిల్లలూ కలసి ఆడుకునేవారు. కలసి బడికి పోయేవారు. అయినా సరే, భూషయ్య మాత్రం పానకాలును పలకరించేవాడు కాదు. అతడిని ఎలా అయినా దెబ్బకొట్టాలని అవకాశం కోసం చూస్తుండేవాడు భూషయ్య..\n\n   ఒకనాడు బడిలో పిల్లలు ఆడుకుంటున్నారు. భూషయ్య కొడుక్కి పానకాలు కొడుకు కాలు తగిలి తూలి కింద పడ్డాడు. కాలు మెలిక పడి విరిగింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆ కబురు తెలిసి భూషయ్య ఆసుపత్రికి పరుగుతీశాడు.\n\n   పిల్లాడికి వైద్యం చేసి కట్టుకట్టారు. వైద్యం ఖర్చులు వెయ్యి రూపాయలు ఇస్తూ భూషయ్య గుండెలు బాదుకున్నాడు.\n\n   ‘పానకాలు కొడుకు వల్లనే నా కొడుకు కాలు విరిగింది. ఆ వైద్యం ఖర్చులు అంతకు అంత పానకాలుతో కక్కించాలి’ అనుకున్నాడు భూషయ్య..\n\n   జరిగిన విషయం చెప్పి డబ్బు ఇవ్వమంటే వకీలు తెలివి తేటలు చూపి పానకాలు మొండి చెయ్యి చూపిస్తాడు. ఇలాంటప్పుడే అతడిని ఇరికించాలి అనుకున్నాడు.\n\n    భూషయ్య.భూషయ్య సరాసరి పానకాలు ఇంటికి వెళ్లాడు. పాఠశాలలో జరిగిన ప్రమాదం గురించి ఇంకా పానకాలుకి తెలియదు. భూషయ్య మొదటిసారి తన ఇంటికి రావడం పానకాలు ఆశ్చర్యం కలిగించింది.\n\n   ‘భూషయ్యా! ఏమిటీ సంగతి?’ అన్నాడు పానకాలు.\n\n   ‘అయ్యా! మీరు పెద్ద వకీలు. మీ దగ్గర చిన్న సలహా కోసం వచ్చాను!’ అన్నాడు భూషయ్య..\n\n   ‘అడుగు...’ అన్నాడు పానకాలు.\n\n   ‘మా కుర్రాడిని ఇంకో కుర్రాడు కాలు మెలిక వేసి పడేశాడు. మా వాడి కాలు విరిగింది. ఆసుపత్రి ఖర్చులు రెండు వేలు అయ్యాయి. ఆ డబ్బు అవతలి కుర్రాడి నుంచి వసూలు చేయడం న్యాయమే కదండీ?’ అన్నాడు భూషయ్య..\n\n   ‘తప్పకుండా వసూలు చేయాలి. కాలు విరిగి నందుకు వైద్యం ఖర్చులు వారే భరించాలి’ అన్నాడు పానకాలు.\n\n   ‘అయితే ఆ రెండు వేలు ఇప్పించండయ్యా!’ అన్నాడు భూషయ్య అతి వినయంగా.\n\n   ‘ఆ కుర్రాడి తండ్రితో మాట్లాడి ఇప్పిస్తాను’ అన్నాడు పానకాలు.\n\n   ‘ఆ కాలు విరగ్గొట్టింది మీ అబ్బాయేనయ్యా!’ వెటకారంగా అన్నాడు భూషయ్య.\n\n   అప్పుడు అర్థం అయ్యింది పానకాలుకి, భూషయ్య డొంకతిరుగుడు కుతంత్రం.\n\n   ‘డబ్బు ఇప్పించండయ్యా!’ తొందర చేశాడు భూషయ్య.\n\n   ‘దానికేం భాగ్యం. మా గుమాస్తాను అడిగి లెక్కలు చూసుకుని డబ్బు తీసుకెళ్లు’ అన్నాడు పానకాలు నవ్వుతూ.\n\n   ‘రెండువేలకు లెక్కలేమిటి?’ అర్థంకానట్లు అడిగాడు భూషయ్య.\n\n   ‘భూషయ్యా! నా దగ్గరికి చాలామంది వచ్చి సలహాలు తీసుకుని వెళ్తుంటారు. ఆ సలహాకి ప్రతిఫలంగా తగిన సొమ్ము చెల్లించి వెళతారు’.\n\n   ‘అయితే!’ నోరు తెరిచాడు భూషయ్య.\n\n   ‘నీవు సలహా అడిగావు. చెప్పాను. నా సలహా ఖరీదు అయిదు వేలు. మా గుమాస్తాతో మాట్లాడి అయిదువేలు కట్టేసేయ్‌. నీ నష్టపరిహారంగా ఆసుపత్రి ఖర్చులకుగాను రెండు వేలు తీసుకుని పో!’ అన్నాడు పానకాలు.\n\n   భూషయ్య గుండె గతుక్కుమంది. తను విసిరిన తాడు తన మెడకే చుట్టుకున్నందుకు ఖంగు తిన్నాడు. తేలు కుట్టిన దొంగలా మారుమాట్లాడకుండా అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు భూషయ్య. అతడి తిక్క కుదిరినందుకు పానకాలు నవ్వుకున్నాడు."